నాలుగేళ్ల నాటి సంగతి. నాతో పనిచేసే అమెరికన్ సహోద్యోగి - పేరు మిషెల్ - కొత్తగా ఒక ఇంటిని కొనుగోలు చేసింది. అందులో అప్పటికే ఒక ఆఫ్రికన్-అమెరికన్ కుటుంబం అద్దెకుంటుంది. వాళ్లు చెల్లించే అద్దె మరీ తక్కువ అని మిషెల్ అనుకోవటంతో, అద్దె కొంచెం పెంచుతూ తన ఏజెంట్ ద్వారా నోటీసు పంపించింది. వాళ్లు అద్దె పెంచటానికి ఒప్పుకోలేదు సరికదా, అప్పటి నుండీ అసలు అద్దె కట్టటమే మానేశారు. రెండు నెలలు చూశాక మిషెల్ ఇల్లు ఖాళీ చేయమంటూ వాళ్లకి నోటీసులు పంపించింది. బదులుగా - వారం తిరిగేలోపు ఈమెకి కోర్టు నోటీసులొచ్చాయి. ‘నల్ల జాతి వాళ్లం కాబట్టే మమ్మల్ని వెళ్లిపోమంటుంది’ అంటూ అద్దెకుండేవాళ్లు మిషెల్‌పై జాతి వివక్ష కేసు పెట్టారు! మాకందరికీ ఆమె కోర్టు నోటీసు చూపిస్తుంటే మేమందరమూ పగలబడి నవ్వటం. పై వారం ఆమె కోర్టుకెళ్లింది. జడ్జిగారు మిషెల్ని, అద్దెవాళ్లని మార్చి మార్చి చూసి మారు మాట్లాడకుండా కేసు కొట్టేశారు. తర్వాత రోజు ఆ విషయం చెబుతూ మిషెల్ నాతో ఓ మాటంది: ‘ఇలా ఉండబట్టే మేమింకా వెనకబడున్నాం’.
సంగతేమిటంటే, మిషెల్ కూడా నల్లజాతి కలువే. ఆమెనెప్పుడూ చూసుండకపోవటం వల్ల అద్దెవాళ్లకి ఆ విషయం తెలీదు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా వాళ్లలా ఆవేశ పడిపోవటం గురించి ఆవిడ ఆవేదనాభరిత విసురది. నిజమే, ఆత్మన్యూనత నిలువెల్లా కమ్మినోళ్లు చీమ చిటుక్కుమన్నా తమనెక్కిరిస్తుందనే అనుకుంటారు.
* * * *
నెలనాళ్లుగా ‘స్లమ్‌డాగ్ మిలియనైర్’ సినిమాని ఆడిపోసుకునే భారతీయులు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మనలాంటి మామూలు జీవులే కాక సమాజంలో రకరకాల రంగాల్లో పేరొందిన ప్రముఖులూ వీళ్లలో ఉన్నారు. కధాంశం గురించి గొడవ చేసేవాళ్లు కొందరు, సినిమా పేరు గురించి అభ్యంతరపెట్టేవాళ్లు ఇంకొందరు, కొన్ని సన్నివేశాల గురించి చిర్రుబుర్రులాడేవాళ్లు మరికొందరు, ఇవేవీ కాకుండా ‘అసలు తెల్లోడెవడండీ మన దరిద్రాన్ని గురించి సినిమా తీయటానికి’ అనేవాళ్లు వేరే కొందరు. మొత్తమ్మీద - ఈ సినిమాలో భారతదేశాన్ని మురికి కూపంలా, వెనకబడ్డ దేశంలా చూపారనేది వీళ్ల ప్రధాన ఆరోపణ. మన పేదరికాన్ని ప్రపంచానికి చూపించి సొమ్ము చేసుకుంటున్నారనేది ఈ సినిమా దర్శక నిర్మాతలపై వీళ్ల కోపానిక్కారణం. దీని దర్శకుడు ఒక ఆంగ్లేయుడు కావటం ఆ అగ్గిలో ఆజ్యం పోసిన విషయం (ఆంగ్లేయుడు కాకుండా ఏ మణిరత్నం వంటి మనవాడో ఈ సినిమా తీసి దానికీ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపొచ్చుంటే వీళ్లేమనుండేవాళ్లో అనేది ఆసక్తికరం). ఇంతకీ, దీనికాధారమైన పుస్తకం రాసిన వికాస్ స్వరూప్ అనబడే ‘మనవాడి’ మీద ఎవరూ విరుచుకుపడకపోవటం గమనార్హం. ఈయన పుస్తకం రాసి సొమ్ము చేసుకోగాలేనిది వాళ్లెవరో సినిమా తీసి చేసుకుంటే తప్పైపోయింది. మనవాడు రాస్తే ఇంపే. వేరే వాడు తీస్తేనే కంపు.
ఈ నిరసనకారుల్లో కొందరు దేశీయ సినీ ప్రముఖులూ ఉన్నారు. భారతీయ ప్రేక్షకుల బలహీనతలనూ, భావావేశాలనూ అందినకాడికి సొమ్ము చేసుకునే పనిలో దశాబ్దాలుగా అలుపన్నదే లేకుండా తలమునకలయ్యున్న వీళ్లు, పరాయి దేశస్థుడెవరో మన పేదరికాన్ని లోకానికి చూపించేసి తలవంపులు తెచ్చాడని గంగవెర్రులెత్తటం గమ్మత్తైన విషయం. నాకెందుకో - ‘అర్రెర్రె.. వాడెవడో ఈ కధతో సినిమా తీసి డబ్బులు దండుకుంటున్నాడు. ఈ అవిడియా మనకెందుకు రాలేదబ్బా’ అనేది వీళ్ల అసలు బాధ అనిపిస్తుంది. నిజంగా అంత బాధే ఉంటే వీళ్లందరూ కలిసి - కుప్పలు తెప్పలుగా కాకపోయినా - దేశం గర్వపడేలాంటిది, కనీసం ఒక్క అద్భుత చిత్రరాజాన్ని తీసి మన పరువు నిలబెట్టొచ్చుగదా. అది మాత్రం చెయ్యరు. వందలాది కోట్ల రూపాయలు తగలేసి ఏ ఏటికా ఏడు చెత్త చిత్రాలు తీసి మన ముఖాన కొట్టే వాళ్లకి ఇదో పెద్ద ఖర్చా? అన్నిటికన్నా చిత్రమైన విషయం - దీని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్న మహానుభావుల్లో కొందరు అసలా సినిమాని చూసుండకపోవటం! తక్కినోళ్లని చూసి తనూ ఓ రాయేద్దామనుకునే మంద మనస్తత్వమే తప్ప సొంత బుర్ర ఉపయోగించే తీరికే లేదు వీళ్లకి.
సరే, ఇంత గొడవ రేపెట్టిన ఈ సినిమాలో ఏముందయ్యా అంటే, పెద్దగా చెప్పుకోటానికి ఏమీ లేదు. నా వరకూ నాకు - ఒకానొక గలీజు సన్నివేశం తీసేస్తే మిగతా సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాగని ఇదేమీ చరిత్రలో నిలిచిపోయే సినిమా కాదు; ఈ ఏడాది వచ్చిన వాటిలో ఒక మంచి సినిమా. అంతే. ఇక, ఈ సినిమా చూసిన విదేశీయులు మన గురించి తక్కువగా అనుకుంటారంటే నేన్నమ్మను. మన మురికివాడల గురించి కళ్లకు కట్టినట్లుండే కార్యక్రమాలు నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ వంటి ఛానెళ్లలో ఇంతకు ముందొచ్చాయి, ఇక ముందూ వస్తాయి. వాటివల్ల మునగని కొంపలు ఈ ఒక్క సినిమాతో మునగవు. దీని దెబ్బకి రేపు రోడ్లమీద అమెరికన్లు నన్నేదో చులకనగా చూస్తారనుకునే న్యూనతా భావం నాకు లేదు. ఒక వేళ వాళ్లలా చూసినా, who cares?
0 comments:
Post a Comment