శ్రీశ్రీ జీవితం, రచనల పరిచయాన్ని ఎనిమిది ప్రకరణలు (అధ్యాయాలు) గా విభజించారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
౧) జీవిత రేఖా చిత్రం: శ్రీశ్రీ ఫలానా రోజున, ఫలానా వారికి ఫలానా ఇంట్లో పుట్టారు.. అంటూ ఉండే ఈ అధ్యాయాన్ని చూసి, నేనేదో “నాన్-డిటేల్” పాఠ్యాంశాన్ని చదువుతున్నా అనిపించింది. ఈ ప్రకరణ మొత్తం అలానే సాగుతుంది కూడా, శ్రీశ్రీ జీవితాన్ని వీలైనంత క్లుప్తంగా పరిచయం చేస్తారు. “చివరి రోజులు” అనే భాగం తప్పించి నేనిందులో కొత్తగా తెల్సుకున్నది ఏమీ లేదు. “నేటి భారతం”కి రాసినదే శ్రీశ్రీ చివరి సినీ గేయమట!
౨) తొలి ప్రభావాలు: ఇందులో శ్రీశ్రీ చిన్నతనంలో అతనిపై గాఢ ముద్రను వేసిన సన్నిహితులు, బంధువులు, గురువులు, సాహిత్యం, అలవాట్లు- ఇలా అన్నింటి గురించీ ప్రస్తావన ఉంటుంది. శ్రీశ్రీ విద్యార్థి దశ నుండే కొందరి పరిచయాల వల్ల ప్రపంచ సాహిత్య పఠనం చేయడం, నచ్చినవి నచ్చినట్టు అనువదించటం చేశారు. ప్రపంచం సాహిత్యంలో ఎక్కడేం జరుగుతున్నా, దాన్ని చదివి స్పందించే ఈ అలవాటు నిజంగానే అబ్బురపరుస్తుంది.
౩) పూర్వరంగ, సమకాలిక పరిస్థితులు: శ్రీశ్రీని ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా అర్థం చేసుకునే ముందు, ఆయన జీవిత కాలంలో, అంతకు మునుపు ఆంధ్ర దేశంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా రాజకీయార్థిక, సాహిత్య లోకపు విశేషాలను ఈ ప్రకరణలో ప్రవేశపెట్టారు. కందుకూరి విరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి, గిడుగు రామ్మూర్తి, గురజాడ, కట్టమంచి రామలింగా రెడ్డి మొదలైన వారందరి సేవలూ తెల్సుకునే వీలుంటుంది. విశ్వనాథ, దేవులపల్లి, చలంతో వారి అనుభవాలే కాక, శ్రీశ్రీ అభిమానించిన కొందరు సమకాలీన హిందీ రచయితలను కూడా ప్రస్తావించారు.
౪) శ్రీశ్రీ రచనలు: మొత్తం పుస్తకంలో నాకిష్టమైన ప్రకరణ. ఇందులో శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానాన్ని, ఇతర గేయ సంపుటలను, నాటికలనూ, వచన రచనలూ పరిచయం చేసిన తీరు అమోఘం. మహాప్రస్థానం గురించి చదువుతున్నప్పుడయితే, ఈ పుస్తకం పక్కకు పెట్టి ఆ కావ్యం తెరిచి ఒక సారి మళ్ళీ కవితలనీ మనసారా చదువుకున్నాను. “తన అభిరుచులనూ, అభిలాషలనూ, ఆదర్శాలను, బలహీనతలను సమాహార ద్వంద్వంగా లక్షించి ఈ విధంగా వర్ణించటం తెలుగు సాహిత్య చరిత్రలో అపూర్వం!” అని కవితా! ఓ కవితా గేయాన్ని ప్రస్తుతించారు.
౫) తనను గురించీ, ఇతురల గురించీ: శ్రీశ్రీ తన జీవితకాలంలో తనను గురించీ, తనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలిసిన వారి గురించి అన్న / అన్నారని లోకుల్లో స్థిరపడిపోయినవన్నీ ఈ ప్రకరణలో ఉంటాయి. శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని అర్థంచేసుకోవాలని ప్రయత్నించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం. “అనుకున్నది అనుకున్నట్టు అనేయడం” అనే లక్షణం వల్ల వచ్చే లాభనష్టాలు తెల్సొస్తాయి. “సకాలంలో రావటం శాస్త్రీయం, రాకపోవటం కృష్ణశాస్తీయం” లాంటి చెమ్మక్కులు తెలుస్తాయి.
౬) వ్యక్తిగా శ్రీశ్రీ: “కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించాను, అది శ్రీశ్రీలా వెలుగుతోంది” అనే పురిపండ గారి వ్యాఖ్యతో మొదలయ్యే ఈ ప్రకరణలో శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని పరికించారు. విరుద్ధ స్వభావాలు ఒకే మనిషిలో ఉండటం, అవి తెచ్చి పెట్టే కష్టనష్టాలు, విపరీతమైన ఖ్యాతినీ, మోజునూ సంపాదించుకున్నా కొన్ని వ్యసనాల వల్ల, ఆ వ్యసనాలను బాహాటంగా ఒప్పుకోవడం వల్ల ఎదుర్కొనవల్సిన విమర్శల గురించీ ఉంటుందిలో! People who don’t try to impress others are the ones who leave indelible impressions అని శ్రీశ్రీని గురించి ఆలోచించేకొద్దీ నాకు అనిపిస్తుంది. జనాలలో ఏర్పడిన ఫ్రేమ కి కాక, తన పంథాన నడిచారు. అందుకే “శ్రీశ్రీ”గా మిగిలారు.
౭) సాహిత్యంలో స్థానం: తెలుగు సాహిత్యాన్ని నేను శాసిస్తాను అన్నారు.. శాసించారు! శ్రీశ్రీ రచనలూ - అది తర్వాతి తరంపై చూపిన ప్రభావాన్ని విశ్లేషిస్తుందీ ప్రకరణ.
౮) భూత భవిష్యత్తులు: “తన జీవితకాలంలోనే చరిత్రప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలో కూడా అలానే జీవిస్తాడు” - ఇంత అద్భుతమైన పుస్తకానికి ఇంతకన్నా ముగింపు వాక్యాలు ఉండవేమో. శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు, వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా!
ఎందుకు చదవాలీ పుస్తకం:
౧) “It’s your charater that is revealed more, when you talk about others” అన్న దాన్ని నమ్ముతాను కనుక, ఈ పుస్తకంలో బూదరాజు గురించే ఎక్కువ తెల్సింది. ఇది చాలా వరకూ నిష్పాక్షక ధోరణిలో సాగినట్టే ఉంది. అనవసరపు పొగడ్తలు గానీ, అవసరమైనప్పుడు మొహమాటాలకి పోవడం కానీ ఈ పుస్తకంలో జరగలేదు. “అనంతం” నుండి సేకరించిన సమాచారాన్ని ఉటంకటించిన చాలా సందర్భాల్లో “.. అని చెప్పుకొచ్చాడు”, “.. అని రాసుకున్నాడు” ఇలా రాశారు. వీరిద్దరికీ వ్యక్తిగత పరిచయం ఉన్నదని చివర్లో ఉంటుంది, చదువుతున్నంత సేపూ అది తెలుస్తూనే ఉంటుంది. శ్రీశ్రీ లాంటి వ్యక్తి మీద రాయడం కత్తి మీద సాము. అది ఆయన చాలా బాగా చేశారు. వీరి తక్కిన పుస్తకాలన్నీ చదవాలని నిశ్చయించుకున్నాను.
౨) తెలుగు.. తెలుగు..తెలుగు! నాలాంటి వాళ్ళు (అస్సలెంత తెలుగుందో కూడా తెలీని అభాగ్యులు) ఒక “రీడింగ్ ఎక్సర్సైజ్”గా తీసుకుని చదివాల్సిన పుస్తకం. రోజూ మాట్లాడుకునే భాష అంటే సరిపెట్టుకోవచ్చు గానీ, కనీసం మన వార్తాపత్రికల్లో కూడా ఈ పదాలెందుకు వినిపించడంలేదో, ఉన్నా నాకు తెలీలేదో అర్థం కాలేదు. ఉదా: ధారవతు అంటే డిపోజిట్! డిపోజిట్ కూడా రాకుండా ఎన్నికల్లో ఓడిపోయాడనే విన్నాను చాలాసార్లు.
౩) శ్రీశ్రీ - తెలుగు జాతిని ఒక ఊపు ఊపిన మహాకవి. కవితలు చదివేసి, ఆనందించటమే కాక ఆ రచనల వెనుకున్న మనిషిని గురించి తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! చదివాక శ్రీశ్రీ ఇంకాస్త దగ్గరవాడవుతాడనటంలో సందేహం లేనే లేదు.
0 comments:
Post a Comment