All characters and incidents in the following piece of work are purely fictional and bear no resemblance to persons living or dead and places and times
* * * * * * * *
“ఏదీ, ఇప్పుడోసారి మొత్తం కధ టూకీగా చెప్పు”
“మన కధానాయకుడు జమీందార్ల ముద్దుబిడ్డ. చిన్నప్పుడు దుష్టరాజు తరమటంతో అతని తల్లిదండ్రులు బీహారు తీసుకెళ్లి పెంచుతారు. యుక్తవయసులో మరదళ్లతో ఆడిపాడుతూ జాలీగా గడిపేస్తుండగా ఓరోజు హిమాలయాల్లో ముని శాపానికి గురౌతాడు. దాంతో జ్ఞానోదయమై ఆస్థిని త్యజించి ప్రజలకి శాంతిమార్గం బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. అతని పేరుప్రఖ్యాతులు చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజును రెచ్చగొట్టి హీరోకి మరణశిక్ష పడేలా చేస్తారు. క్లైమాక్స్‌లో ఉరి తీయబడ్డ హీరో - తల్లి పాడిన ఆవేదనాభరిత పాటకి దేవుడు కరిగి కరుణించటంతో - మళ్లీ బతుకుతాడు. కధ సుఖాంతం”
“బాగుంది. ఇది ఫైనల్ చేద్దాం”
“అలాగే గురూజీ. ఐతే .. నాదో చిన్న అనుమానం”
“ఏమిటది?”
“ఇది ఏసుక్రీస్తు కధ అని ఎవరికీ అర్ధమవదేమో .. ??”
* * * * * * * * * * * *
(వారం క్రితం)
“హలో, జి.హెచ్.భైరవి స్పీకింగ్”
“నేను .. జె.వైభవేంద్రరావు, సి.ఎ”
“గుడ్‌మోణింగ్ గురూజీ. చాన్నాళ్ల తర్వాత ఫోన్! ఏమిటి విశేషం?”
“కొత్త పౌరాణిక చిత్రం తీసే ఆలోచనలో ఉన్నా. అందుకే నీకు ఫోన్”
“భలే. నా పెన్నుకి మళ్లీ పని. ఈ సారెవరి గురించేం?
“ఏసు క్రీస్తు”
“అదేం .. మన పురాణాలు బోలెడున్నాయిగా!!”
“ఎప్పుడూ అవే తీస్తే మొనాటనీ వచ్చేస్తుందయ్యా. అందుకే ఈ సారి రొటీన్‌కి భిన్నంగా వెళ్దామని. అదీకాక, ఇప్పుడు పాత తెలుగు సినిమాలకి రీమేక్కొట్టే ట్రెండ్ నడుస్తుంది కదా”
“నిజమే గురూజీ. అసలా ట్రెండ్ మొదలెట్టిందే మనం. అలనాటి గోండురంగ మహత్యం పట్టుకుని మొన్న గోండురంగడు తీసేశాం. ఇప్పుడు పాత కరుణారసమయుడుని రీమేక్ చేసేద్దాం”
“రీమేకే కానీ మన బాణీలో ఉండాలి”
“అర్ధమైంది. హీరో ఎవరేంటి మరి?”
“ఇంకా ఎవరూ అనుకోలేదు”
“యువవజ్ర గోలకృష్ణ ఐతే బాగుంటుందేమో?”
“వద్దులే. ఉన్న డబ్బంతా ఆయన విగ్గులకే ఐపోతుంది. సెట్టింగులకి ఇంకేమీ మిగల్దు. మొన్న గోండురంగడికీ అంతే అయింది. దానికి తోడు మొత్తం లిప్‌స్టిక్కులు, మేకప్పు సామాన్లు కూడా ఆయనకే వాడేసే సరికి పాపం హీరోయిన్ ‘కుమారి’ స్నేషకి మేకప్ లేకుండానే లాగించాల్సొచ్చింది”
“ఔనౌన్నిజమే. పైగా తొడకొట్టే సీన్ ఒక్కటన్నా లేకపోతే ఆయనొప్పుకోడు. ఏసుక్రీస్తు తొడకొడితే బాగోదేమో. పోనీ .. బుల్లిబాబు లక్కినేని గానార్జున ఐతే? ఈయన మనకి లక్కీ మస్కట్ కూడాను. రెండు హిట్లు తీశాంగా ఈయన్తో. ఇంకా, బుల్లిబాబైతే ఎంచక్కా ఎంత కావాలంటే అంత సొంత జుట్టు, గెడ్డం కూడా పెంచుకుంటాడు. ఆ వారా మనకి విగ్గుల ఖర్చు మిగులుద్ది”
“బుల్లిబాబైతే బానే ఉంటుంది కానీ ఈయనీ మధ్య దుష్ట గాంక్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నాడు. తెల్సు కదా, నేను తెలుగురాష్ట్రం వాడ్ని. బుల్లిబాబొద్దులే”
“మరి పరంజీవి ఐతే? పురాణ పాత్రలెయ్యాలనే గుల వీరిక్కూడా ఉంది. అందుకే కదా శ్రీచెంచునాధలో చిన్న పాత్రే ఇచ్చినా ఎగిరి గంతేసి చేసేశారు. ఇప్పుడు ఫుల్‌ప్లెడ్జ్‌డ్ రోల్ అంటే మహదానందంగా ఒప్పుకుంటారేమో”
“ఏమయ్యా భైరవి. బొత్తిగా లోక జ్ఞానం లేదు నీకు. పరంజీవి సినిమాలు మానేసి సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు తెలీదా? ఎప్పుడూ పురాణాలే కాకుండా అప్పుడప్పుడూ న్యూస్‌పేపర్లూ చదూతుండాలయ్యా”
“ఓ. పరంజీవి సినిమాలు మానేశారా? మరి ఇంకెవరున్నారబ్బా?”
“తుమ్ముబాటి సంకటేష్ ఐతే ఎలా ఉంటాడని ఆలోచిస్తున్నా”
“అద్భుతం సార్, సూపర్ ఐడియా. ఈయనొక్కడితోనే మనం పౌరాణికం తియ్యలేదు ఇందాకా. ఫ్యామిలీ హీరోగా సంకటేష్ ఇమేజ్ కూడా మన సినిమాకి ప్లస్సవుద్ది. ఏసుక్రీస్తు పాత్ర ఈయనకి టైలర్ మేడ్ రోల్. ఇంకెందుకాలస్యం, సంకటేష్‌నే ఫైనల్ చేసెయ్యండి సార్”
“అదే అనుకుంటున్నా. పైగా వీళ్ల నాన్న మా తెలుగురాష్ట్రం పార్టీవోడే. సంకటేషే ఫైనల్”
“ఇంతకీ, సినిమా పేరు ఏమనుకుంటున్నారు”
“శ్రీ ఏసుక్రీస్తుడు”
“అబ్బో అదిరిపోయింది. పేర్లోనే తెలుగు నేటివిటీ కుమ్మేశారు”
“నేనెప్పుడూ చెబుతా కదా. నేటివిటీ లేపోతే సినిమా ఎంత బాగున్నా ఫ్లాపే. మొన్న గోండురంగడు అంత బాగుండీ ఢామ్మనటానిక్కారణం దాన్ని బ్యాంకాక్‌లో తియ్యటమే. ఈసారలాంటి సిల్లీ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడాలి సుమీ”
“ఔనౌను. పైగా గోండురంగడు థాయ్ అమ్మాయిల్తో గెంతులేసినట్లు కూడా చూపించాం. అదే దెబ్బ కొట్టింది”
“అలాంటి తప్పులు మళ్లీ దొర్లకూడదు. ఏసుక్రీస్తు మీద తెలుగు సినిమా తీస్తే ఆయనది రాయలసీమో, తెలంగాణో అని చూపించాలి. నేటివిటీ ముఖ్యం …. ఏమ్ముఖ్యం?”
“అర్ధమైంది సార్. సినిమాకి నేటివిటీ ముఖ్యం”
“భేష్. అందుకేనయ్యా నువ్వు నాకు నచ్చుతావ్. ఏం చెప్పినా ఠకీమని పట్టేస్తావ్. సరే, నేను సంకటేష్‌కి ఫోన్ చేసి కాల్షీట్ల గురించి మాట్లాడాలి. నువ్వు కధొండే పని మీదుండు”
“ఆగండాగండి, ఫోన్ పెట్టేసేముందు .. క్రీస్తు గురించి ఏవన్నా రిఫరెన్సు బుక్కులుంటే ఇద్దురూ”
“బైబిల్ చదవ్వయ్యా. అంతకన్నా పెద్ద రిఫరెన్సేముంటది”
“అలాగలాగే. ఐతే నేనో వారం తర్వాత కలుస్తా, స్చ్రిప్టుతో సహా”
“మంచిది. బై ఇంక”
“బై”
* * * * * * * *
(ప్రస్తుతం)
”నమస్తే గురూజీ”
“రావయ్యా భైరవి. కూర్చో. ఎంతవరకూ వచ్చిందేమిటి స్క్రిప్టు?”
“రెడీ సార్. వింటారా?”
“ఊఁ కానీ”
“జనాభా లెక్కల కోసం జోసఫ్ మేరీతో కల్సి సొంతూరికి బయల్దేరటంతో సినిమా మొదలౌతుంది. గాడిదల మీద ప్రయాణం, ఎక్కడా ఆశ్రయం దొరక్కపోటం, ఎక్కే గడపా దిగే గడపా, పశువులపాకలో క్రీస్తు జననం, ముగ్గురు జ్ఞానులు రావటం .. ఇదంతా టైటిల్సప్పుడు చూపిస్తాం. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా ఉంటుంది”
“బావుంది, బావుంది. జోసఫ్ పాత్రకి పాత సినిమాలో క్రీస్తు వేషమేసినాయన్ని పెడదాం. మేరీ ఎవరనేది చూడాలి. మదర్ సెంటిమెంటు కురిపించేవాళ్లు కావాలి”.
“జోసఫ్‌గా విజయసుందర్? అబ్బో .. మీకు మీరే సాటి గురూజీ. వెరీ యాప్ట్ ఛాయిస్”
“సరె, సరె. తర్వాత?”
“టైటిల్స్ తర్వాత, బాల ఏసుని చంపేయమని హేరోదు సైనికుల్ని పంపిస్తాడు. అప్పుడు మేరీ, జోసఫ్ ఏసునెత్తుకుని ఈజిప్టుకి పారిపోతారు”
“భలే. ఇక్కడో సిటుయేషనల్ సాంగ్ పెట్టొచ్చు. ‘బ్రోచేవారెవరురా’ బావుంటుంది”
“క్రీస్తు కధలో త్యాగరాజ కీర్తనా!?!”
“చెప్పా కదయ్యా. నేటివిటీ, నేటివిటీ ముఖ్యం”.
“ఓహ్. మర్చిపోయా సార్. అలాగే .. బ్రోచేవారెవరురా బాగుంటుంది. ఏసుబోస్ గారితో పాడిద్దాం”
“ఆయన పెద్దాడైపోయాడయ్యా. వాళ్లబ్బాయి వినయ్ ఏసుబోస్‌తో పాడిద్దాంలే. వాళ్ల నాన్నకన్నా బాగా ముక్కుతో పాడతాడు”
“అలాగే గురూజీ. ఇంతకీ సంగీత దర్శకుడెవరు?”
“ఉన్నాడుగా ఆస్థాన విద్వాంసుడు ఎన్.ఎన్.కూరవాణి. యూ కంటిన్యూ”
“ఇక్కడో ..”
“వెయిటే సెకండ్.. ఇందాక ఈజిప్టన్నావు? మార్చెయ్ .. దాన్ని బీహార్ చేసెయ్. హీరో బీహార్లో కొన్నాళ్లుండటం తెలుగు సినిమాల్లో లేటెస్ట్ ఫ్యాషన్. ట్రెండ్‌కి తగ్గట్లుండాలయ్యా”
“కానీ సార్ .. “
“కానీ గీనీ లేదు. కధ .. కధ ముఖ్యమయ్యా - ప్రదేశాలు కాదు”
“సరే గురూజీ. నేపధ్యంలో వినయ్ ఏసుబోస్ ‘బ్రోచేవారెవరురా’ వస్తుండగా బాల ఏసునెత్తుకుని జోసఫ్, మేరీలు బీహారుకి పారిపోతారు”
“దట్స్ మచ్ బెటర్. నౌ, కంటిన్యూ”
“ఇక్కడో డిజాల్వ్ షాట్, ఫేడిన్, తర్వాతో ఎస్టాబ్లిష్‌మెంట్ షాట్. మట్టి ఇల్లొకటి చూపిస్తాం. తర్వాత ఎక్స్‌ట్రీం క్లోజప్. కొయ్యని చిత్రిక పడుతున్న ఏసుక్రీస్తు - అదే మన సంకటేష్ బాబు - చేతులమీదనుండి జూమౌట్ చేస్తాం. హీరో ఇంట్రడక్షన్ కదా, కూరవాణి రీరికార్డింగ్ అదరగొట్టాలిక్కడ”
“ఆగాగు .. చిత్రిక పట్టటమేంటి? టూ సింపుల్. ఇంట్రడక్షన్ సీన్లు రాసేటప్పుడు హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకోవాలయ్యా. ఆ సీన్ మార్చు. క్రీస్తు పిడికిలి బిగించి ఒక్కటి గుద్దితే దూలం విరిగిపోయినట్లు చూపిద్దాం. అలాగే గుద్ది గుద్ది చెక్కలన్నీ ముక్కలు చేసేస్తాడన్నమాట”
“వావ్. సూపర్ సార్. అందుకే మీరు దర్శకచంద్రులయ్యారు. అలాగే మారుద్దాం. ఒక్కో గుద్దునీ నాలుగైదు యాంగిల్స్‌లో తిప్పి తిప్పి చూపిద్దాం, స్లో మోషన్లో. ఎడిటర్‌కి ఫుల్లు పనే పని”
“సరె, సరె. కంటిన్యూ”
“ఓకే. చెక్కలు ముక్కలయ్యాక క్రీస్తు చెమటలద్దుకుంటూ ఇంటి బయటికొస్తాడు. అక్కడ అప్పటికే ఆయన ఉపదేశాలు వినటానికొచ్చిన జనం వెయిట్ చేస్తుంటారు”
“ఆగాగు మళ్లీ. చెమటలేంటి? హీరోకి చెమటలు పట్టకూడదు. మార్చు. ఇంకోటి .. అప్పుడే ఉపదేశాలేంటి? అవన్నీ సెకండాఫ్‌లో. ఫస్టాఫ్‌లో రొమాన్సేది, డ్యూయెట్లేవి?”
“ఏసుక్రీస్తు కధలో రొమాన్సు .. ?? బైబిల్‌లో అలాంటివి లేవు గురూజీ”
“నువ్వేం మనిషివయ్యా భైరవి. షో సమ్ క్రియేటివిటీ. బైబిల్‌లో లేకపోతే మాత్రం మనం ఇరికించకూడదని ఉందా? ఏం .. అక్కమయ్య, శ్రీఆదిదాసు కధల్లో రొమాన్సు దూర్చలా? ఇదీ అంతే”
“అలా చేస్తే హిందువులొప్పుకున్నారు కానీ క్రైస్తవులొప్పుకోరేమో?”
“అవి లేకపోతే ప్రేక్షకులొప్పుకోరయ్యా. నే చెప్పినట్లు చెయ్యి”
“ఎలా గురూజీ, ఎక్కడ ఇరికించాలి?”
“క్రీస్తు ముప్పయ్యేళ్లొచ్చేదాకా ఏం చేశాడో ఎవరికీ తెలీదు కదా. మనం సరిగా దాన్నే వాడుకుంటాం. ఆ సమయంలో ఆయన డ్యూయెట్లు పాడినట్లు చూపించేస్తే సరి”
“ఎవరితో గురూజీ?”
“ఇంకెవరితో …. మేనమామ కూతుళ్లతో. మొత్తం ముగ్గురు. ‘కుమారి’ స్నేష, ‘కుమారి’ త్రిహ, ‘కుమారి’ అనూహ్య ఐతే మంచి స్టార్ వాల్యూ కూడా వస్తుంది సినిమాకి. బిజినెస్ అదిరిపోతుంది”
“క్రీస్తు మేనమామ గురించి బైబిల్‌లో లే ..”
“లేకపోతే మనం పుట్టిద్దాం. ఎం.బేలయ్యతో ఆ పాత్ర వేయిద్దాం. రాసెయ్. ఎవరన్నా గొడవ చేస్తే క్రీస్తుకి మేనమామ లేడని వాళ్లనే రుజూ చెయ్యమందాం. ఎంత కాంట్రవర్సీ ఐతే అంత బిజినెస్”
“అలాగే గురూజీ. రాసేద్దాం”
“మరదళ్లతో మంచి బీటున్న పాటోటి పెట్టాలి. గుర్తుంచుకో”
“తప్పకుండా గురూజీ. పల్లవి ‘నగుమోము చూడరా, నజరేతు వీరుడా’ అనుంటే బాగుంటుందేమో”
“భేషో. ఆశుకవివైపోతున్నావయ్యా. పల్లవి బాగుంది. అదే ఉంచేద్దాం”
“అబ్బే ఆశుకవా పాడా. ఏదో అప్పుడప్పుడూ కవితావేశం తన్నుకొస్తుంది. అంతే సార్”
“సర్లె, సర్లె. ఫస్టాఫ్‌లో కామెడీ మిస్సవకూడదు. అది చాలా ముఖ్యం”
“కామెడీ ట్రాక్ సంగతొక్కటే తట్టలేదు గురూజీ. మీరే హెల్ప్ చెయ్యాలి”
“దానికంతాలోచనెందుకయ్యా. పరమానందంతో ఓ ట్రాక్ పెడదాంలే. ఆయన పాత్ర పేరు పిలక శాస్త్రులు. పక్కన మరో ఇద్దరు పంతుళ్లనేసుకుని హడావిడి చేస్తుంటాడు. వీళ్లకి మెయిన్ స్టోరీతో ఏం సంబంధం లేకుండా జాగ్రత్త పడితే సరిపోద్ది”.
“బాగుంది కానీ, గురూజీ .. బైబిల్లో బ్రాహ్మల్లేరు కదా!?!”
“పిచ్చి భైరవీ. నేటివిటీ, నేటివిటీ”.
“సరే సార్. మరదళ్లతో జాలీగా పాటలు పాడేస్కుంటూ తిరుగుతున్న హీరోని చూసి పైన యెహోవాకి కోపమొస్తుంది. నేను ఇతన్ని భూమ్మీదకెందుకు పంపాను, ఇతను అక్కడేమి చేస్తున్నాడు అని కోపించి అసలు పని గుర్తు చేయమని దేవదూత గేబ్రియెల్‌ని కిందకి పంపుతాడు …. గురూజీ, యెహోవా పాత్రకి సుందర నటుడు అమన్ ఐతే బాగుంటాడేమో. ఆయనకి ఎస్.బి.పాలసుబ్రహ్మణ్యంగారితో డబ్బింగ్ చెప్పిద్దాం”
“అమన్ .. గుడ్ ఐడియా. కానీ మధ్యలో గేబ్రియల్ ఎందుకు దండగ. యెహోవానే కోయవాడి వేషంలో భూమ్మీదికొచ్చి క్రీస్తుకి జ్ఞానోదయం చేస్తాడు”
“అలాగే మారుద్దాం. ఇక్కడ మళ్లీ ఓ సిటుయేషనల్ సాంగ్. ‘కోయవాడి ధాటికి మారిపోయె యేసువా’ అంటూ. సంకర మహదేవన్‌తో ఓ పదినిమిషాల బ్రీత్‌లెస్ వేయిద్దామిక్కడ”
“ఆగాగు. అప్పుడే మారిపోతే ఎలా? మన హీరో ధీరోదాత్తుడు. దేవుడే దిగొచ్చినా అతను మారడు, తనంతట తానుగా మారాల్సిందే”
“దేవుడు చెప్పినా మారనోడు ఉత్తినే తనంతట తానే మారాడంటే కన్విన్సింగ్‌గా ఉండదేమో?”
“ఐతే ఎవరన్నా మునితోనో, ముష్టివాడితోనో హితబోధ చేయిద్దాం”
“మునే బెటరేమో గురూజీ”
“ఐతే ఈ లైన్ వేస్కో. హీరో హిమాలయాల్లో ఆడిపాడుతూ విచిత్రముని ధ్యానానికి భంగం కలిగిస్తే ఆయన ఆగ్రహించి ‘నువ్వు శిలువమీద కొట్టబడుదువుగాక’ అని శపిస్తాడు. అప్పుడు జ్ఞానోదయమైన హీరో మన్నించమని అడిగితే ఆయన ‘నా శాపానికి తిరుగులేదు, కానీ ఓ విరుగుడుంది. ఇకనుండీ జనులకి మంచి బోధిస్తూ బ్రతుకు. అలా చేస్తే నువ్వు మరణించిన మూడో రోజు మళ్లీ బ్రతుకుతావు’ అని చెబుతాడు”
“.. మునులూ, శాపాలూ అంటే జానపదం ఐపోతుందేమో గురూజీ? ఇది పౌరాణికం కదా”
“ఇప్పుడా తేడాలన్నీ ఎవరికి తెలుసోయ్? బాగుంటుంది. అలాగే ఉంచు”
“అలాగలాగే. ముని శాపం సినిమాకే హైలైట్. ఈ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పెడదాం. అన్నట్లు, ముని వేషానికి కనెక్షన్‌కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ) ఐతే బాగుంటుంది సార్. ఆయన మామూలుగా మాట్లాడినా బూతులు తిట్టినట్లుంటుంది. శాపాలిచ్చే ముని వేషానికి ఆయనే పర్‌ఫెక్ట్ ఫిట్”
“ఎగ్జాక్ట్‌లీ…. నేనూ కనెక్షన్‌కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ) నే అనుకుంటున్నానయ్యా. సంకటేష్ బాబుకి లెక్చరివ్వాలంటే ఆ మాత్రం స్టేచరు, నేచరు, సీనియార్టీ ఉన్న లెజెండు కావాలి. ఆయన్నే ఖాయం చేద్దాం. యూ కంటిన్యూ నౌ”
“ఇంటర్వెల్ తర్వాత జ్ఞానోదయమైన హీరో జల్సాజీవితానికి స్వస్తి చెప్పి ప్రజలకి శాంతిమార్గాన్ని బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. ప్రజల్లో ఆయనకి పెరుగుతున్న ఆదరణ చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజుకి క్రీస్తుపై పితూరీలు చెప్పి ఆయన్ని శిక్షించమని గొడవచేస్తుంటారు. ఆయన శిష్యుల్లో ఒకడైన జూదాస్ వెన్నుపోటుతో క్రీస్తుని సైనికులు పట్టుకుంటారు. అక్కడినుండీ క్లైమాక్స్ సీన్ మొదలౌతుంది”
“హోల్డిట్ దేర్. సెకండాఫ్‌లో ఎంటర్టెయిన్‌మెంటేదీ? మరీ ఇంత డ్రైగా ఉంటే ఒక వర్గం ప్రేక్షకులు లేచెళ్లిపోతారు. కాబట్టి ఇక్కడో రొమాంటిక్ సాంగ్ పెడదాం”
“మరదళ్లని వదిలేశాడు కదా. రొమాన్స్‌కి తావెక్కడ?”
“పిచ్చోడా. రచయిత తల్చుకుంటే చెయ్యలేని పనుందా? మేరీ మాగ్దలీన్ అని ఓ క్యారక్టరుంది చూడు. ఆవిడతో పాటొకటి పెట్టేద్దాం”
“గొడవలైపోతై సార్. ఇలాంటి విపరీత కల్పనలు చేస్తేనే డావించీ కోడ్ సినిమాని బ్యాన్ చేశారు”
“వెర్రివాడా. ఏం చేసినా తెలివిగా చెయ్యాలయ్యా. ఇది పిలక శాస్త్రులు ఊహించుకునే డ్రీమ్ సీక్వెన్స్‌లా పెడతాం. అప్పుడు మనల్నెవరూ తప్పు పట్టలేరు”
“భలే ఐడియా. ఎంతైనా మీరు మీరే సార్”
“పొగడ్తలాపు. అన్నట్లు, గుర్తుంచుకో. ఈ పాట కోసం పది లారీలు ఖర్జూరాలు, ఇరవై లారీలు ఈత పండ్లు ఆర్డరివ్వాలి. చాలా రిచ్‌గా తియ్యాలీ పాట”
“అలాగే సార్. నాదో సలహా. మాగ్దలీన్ పేరుని ముగ్ధ అని మారుద్దాం”
“నేటివిటీ పాఠం బాగానే వంటబట్టిందన్నమాట. అలాగే మారుద్దాం. ముగ్ధ పాత్రకి డాబు ఐతే బాగా సూటవుతుంది”
“డాబు సూపర్ సెలక్షన్ గురూజీ. మీ కాస్టింగే కాస్టింగు”
“సర్లే, సర్లే. కంటిన్యూ”
“ఎక్కడున్నాం…. ఆఁ.. క్లైమాక్స్ మొదలౌతుందా, లాస్ట్ సప్పర్ చేసి ప్రార్ధన కోసం క్రీస్తు కొండమీదికెళతాడు. అక్కడ సైతానొచ్చి క్రీస్తుని టెంప్ట్ చెయ్యటానికి ట్రై చేస్తాడు, ‘ఈ కొండ మీంచి దూకు, నీ తండ్రొచ్చి రక్షిస్తాడేమో చూస్తా, ..’ ఇలాగన్నమాట”
“ప్చ్..ప్చ్.. తెలుగు సినిమా హీరో కొండమీంచి దూకితే దేవుడొచ్చి రక్షించటమేంటి? మార్చెయ్. టెంప్టింగంటే ఇదా? సైతాను నునైత్ ఖాన్ రూపంలో వచ్చి మాంఛి ఐటెమ్ సాంగ్ చేసినట్లు పెడదాం - కూరవాణితో అదిరిపోయే మసాలా బాణీలొండిద్దాం. అది చూసి కూడా హీరో చలించడు”
“అలాగే చేద్దాం సార్. పాటవ్వగానే సైనికులొచ్చి హీరోని పట్టుకుపోతారు. విచారణ, శిక్ష విధించటం, శిలువెయ్యటం, మరణించటం .. చివరి పావుగంటలో నడిపిస్తాం ఇవన్నీ. మూడో రోజు శాప విమోచనమై తిరిగి లేస్తాడు. ది ఎండ్”.
“ఏదో మిస్సైనట్లుందే .. ఆఁ.. మదర్ సెంటిమెంటేదీ?”
“శిలువ వేసినప్పుడు సిటుయేషనల్ సాంగ్ మదర్ సెంటిమెంటుది పెడదాం సార్. అన్ని రకాల పాటలూ కవరైపోతాయి”
“మరో ఐడియా. సెంటిమెంటు సాంగు కాకుండా ఆమె దేవుడిని ప్రశ్నిస్తూ పాడే పాటలా పెడదాం. దెబ్బకి దేవుడు దిగొచ్చి హీరోని బ్రతికిస్తాడు”.
“శాప విమోచనం ప్రకారం మూడో రోజు ఎటూ బ్రతుకుతాడు కద సార్”
“శాప విమోచనం క్యాన్సిల్. మునితో ఓన్లీ శాపం. నో విమోచనం. ఆ పని ఇప్పుడు మదర్ పాటపాడి చేయిస్తుంది”.
“మూడు రోజుల పాటు పాడుతూనే ఉంటుందా సార్!?!”
“నో. అదీ మారుద్దాం. అదే రోజు పునరుత్థానం జరుగుతుంది”.
“అలాగే. ఇదే బాగుంది. మార్చేద్దాం”
“ఇంకోటి. క్రీస్తుగురించి వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆయన్ని శిలువేసినట్లే చూపించారు. మనం వెరైటీగా ఉరి తీసినట్లు చూపిద్దాం”
“మరీ ఇన్ని మార్పులా?”
“అమాయకుడా. వీటిని మార్పులూ చేర్పులూ అనకూడదు .. ఇంప్రొవైజేషన్స్ అనాలి. అంటే అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పటం అన్నమాట”
“ఓ. ఐతే ఓకే. మీరెలాగంటే అలాగే గురూజీ”
“మరోటి. బిగినింగ్‌లో క్రీస్తు పశువులపాకలో పుడతాడన్నావు .. ?”
“అవున్సార్. బైబిల్లో అలాగే ఉంది”
“దాన్నీ మార్చెయ్. హీరో అంత పేదవాడంటే సంకటేష్ బాబు ఇమేజ్ దెబ్బ తినుద్ది. బాగా రిచ్ ఫ్యామిలీలో - వీలైతే జమీందారీ కుటుంబంలో -పుట్టినట్లు చూపిద్దాం”
“ఓకే సార్. మీకలా బాగుందంటే అలాగే మారుద్దాం”
“గుడ్. ఏదీ, ఇప్పుడోసారి మొత్తం కధ టూకీగా చెప్పు”
“మన కధానాయకుడు జమీందార్ల ముద్దుబిడ్డ. చిన్నప్పుడు దుష్టరాజు తరమటంతో అతని తల్లిదండ్రులు బీహారు తీసుకెళ్లి పెంచుతారు. యుక్తవయసులో మరదళ్లతో ఆడిపాడుతూ జాలీగా గడిపేస్తుండగా ఓరోజు హిమాలయాల్లో ముని శాపానికి గురౌతాడు. దాంతో జ్ఞానోదయమై ఆస్థిని త్యజించి ప్రజలకి శాంతిమార్గం బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. అతని పేరుప్రఖ్యాతులు చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజును రెచ్చగొట్టి హీరోకి మరణశిక్ష పడేలా చేస్తారు. క్లైమాక్స్‌లో ఉరి తీయబడ్డ హీరో - తల్లి పాడిన ఆవేదనాభరిత పాటకి దేవుడు కరిగి కరుణించటంతో - మళ్లీ బతుకుతాడు. కధ సుఖాంతం”
“బాగుంది. ఇది ఫైనల్ చేద్దాం”
“అలాగే గురూజీ. ఐతే .. నాదో చిన్న అనుమానం”
“ఏమిటది?”
“ఇది ఏసుక్రీస్తు కధ అని ఎవరికీ అర్ధమవదేమో .. ??”
“పిచ్చివాడా. ప్రేక్షకులు మరీ అంత దద్దమ్మలనుకున్నావా? సినిమా టైటిల్లోనే ఉంది కదా అదెవరి కధో. తెలుగు సినీగోయెర్స్‌కి కధలో నవరసాలుండటం ముఖ్యమయ్యా, ఒరిజినల్ స్టోరీతో పోలికుందో లేదో వాళ్లు పట్టించుకోరు. కధకన్నా కధనం ముఖ్యమనే సినీ సామెత విన్లేదా? నీకు మరీ అంత అనుమానమైతే సినిమా మొదట్లో ‘ఈ కధలోని పాత్రలన్నీ కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు’ అని ఓ ముక్క పడేద్దాంలే. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు - అటు సెన్సారోళ్ల పేచీ ఉండదు, ఇటు చరిత్రకారుల గొడవా ఉండదు - ప్రేక్షకజనాలకి మాత్రం ఇది ఎవరో ఒకర్ని ఉద్దేశించి తీసిందే అని అర్ధమైపోద్ది”
“సూపర్ సార్. ఎంతైనా వంద సినిమాలు తీసిన తెలివితేటలెక్కడికి పోతాయి? మీలాంటి గురువుగారు దొరకటం నిజంగా నా అదృష్టం”
“పొగడ్తలాపవయ్యా. నాకవి నచ్చవని తెల్సుగా. వెళ్లు, వెళ్లి స్క్రిప్టు రివైజ్ చేసే పన్లో ఉండు. నేను రేపట్నుండే గెడ్డం పెంచటం మొదలెడతా. పది రోజుల్లో సినిమా మొదలెట్టి క్రిస్మస్ నాటికి విడుదల చెయ్యాలి”
“అలాగలాగే. మళ్లీ వారంలో స్క్రిప్ట్ పక్కాగా రాసుకుని కలుస్తా సార్”
0 comments:
Post a Comment