భారత్ తొలిసారి చంద్రుడిపైకి పంపిన అంతరిక్ష నౌక (చంద్రయాన్- 1) అక్కడ నీటి జాడలు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) గురువారం ప్రకటించింది. చందమామపై నీటి జాడలు గుర్తించడం వెనుక ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) కృషిని విస్మరించలేమని నాసా శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చంద్రయాన్- 1లో జాబిలిపైకి వెళ్లిన 11 పరికరాల్లో నాసా రూపొందించిన మూన్ మినిరాలజీ మ్యాపర్ (ఎం3) కూడా ఉంది. ఈ ఎం3 పంపిన వివరాలను అమెరికాలోని మూడు బృందాలు విశ్లేషించాయి. శాస్త్రవేత్తల పరిశోధనల్లో జాబిలిపై నీరు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు ఉన్న చంద్రుడి ఉపరితలం పొడిగా ఉంటుందనే భావన పటాపంచలైంది.

చంద్రుడి ఉపరితలంపై నీటి ఉనికికి సంబంధించిన స్పష్టమైన రసాయన ఆనవాళ్లు కనిపించాయి. చంద్రుడిపై నీటి జాడలు గుర్తించడంతో ఇప్పుడు శాస్త్రవేత్తలు అక్కడ ఎంత పరిమాణంలో నీరుందో తెలుసుకోవడంపై దృష్టిసారించనున్నారు. చంద్రయాన్- 1 సాధించిన ఫలితాలతో విశ్వంలో జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

ఇస్రో చరిత్రలో చంద్రయాన్- 1 గొప్ప ముందడుగని భారత శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి వెలుపల మరో ప్రాంతంలో నీటి జాడలు స్పష్టంగా గుర్తించడం ఇదే తొలిసారి. చంద్రయాన్- 1 సాధించిన ఈ ఘనతపై ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్- 1లో మొత్తం 11 పరికారాలు ఉన్నాయని, ఇవన్నీ పంపిన సమాచారాన్ని విశ్లేషిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెలియవచ్చని చెప్పారు.

ఇదిలా ఉంటే చంద్రయాన్- 1 ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై మా బేబి విజయాన్ని సాధించిందన్నారు. వాస్తవానికి 40 ఏళ్ల క్రితమే చందమామపై అమెరికా శాస్త్రవేత్తలు నీటి జాడలు ఉన్నట్లు చెప్పారు. అపోలో యాత్రల సందర్భంగా చంద్రుడిపైకి వెళ్లిన అమెరికా వ్యోమగాములు భూమికి తెచ్చిన జాబిలి శిలల్లో నీటి ఆనవాళ్లు గుర్తించారు.

అయితే భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ శిలలు ఉంచిన పెట్టెలు ప్రమాదవశాత్తూ తెరుచుకున్నాయి. దీంతో వీటిపై గుర్తించిన నీటి జాడలు భూవాతావరణంలోనే ఏర్పడి ఉంటాయని అనుమానాలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలను చంద్రయాన్- 1 పంపిన సమాచారంతో పటాపంచలయ్యాయి.

ప్రపంచం చాలా కాలం నుంచి విశ్వంలో జీవం కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జీవుల మనుగడకు అత్యంత కీలకమైన నీటిని అన్వేషించడంపై గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. తాజా ఫలితాలతో నీటి ఆనవాళ్లు తెలుసుకునేందుకు జాబిలిపై మరిన్ని దేశాలు దృష్టిసారించే అవకాశం ఉంది.

Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates